ప్రపంచ చెస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న ప్రారంభం కానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్‌తో ఉజ్బెకిస్థాన్ ఆటగాడు జవోఖిర్ సిందరోవ్ తలపడనున్నాడు. ఇద్దరికీ ప్రస్తుతం 20 ఏళ్లే కావడం విశేషం. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను వెనక్కి నెట్టి గుకేశ్‌తో టైటిల్ పోరుకు అర్హత సాధించిన సిందరోవ్ ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన అతడు.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వీడియో గేమ్స్‌తో మొదలైన ప్రయాణం

ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో సిందరోవ్ జన్మించాడు. అతడి తండ్రి వ్యాపారవేత్త కాగా.. తల్లి ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్‌పై సిందరోవ్‌కు విపరీతమైన ఆసక్తి ఉండేది. గంటల తరబడి కంప్యూటర్ ముందు గడిపేవాడు. కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన తర్వాత కూడా తెల్లవారుజాము వరకు గేమ్స్ ఆడేవాడు.

అయితే అతడి కుటుంబంలో చెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తాత కొమిల్ సిందరోవ్ ఉజ్బెకిస్థాన్ చెస్ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించగా.. సోదరులు కూడా ఈ ఆటలోనే ఉన్నారు. దీంతో క్రమంగా సిందరోవ్‌కు చదరంగంపై ఆసక్తి పెరిగింది. అనతికాలంలోనే ఆటలో మంచి నైపుణ్యం సంపాదించాడు.

2012లో ఆసియా పాఠశాలల చెస్ టోర్నీలో అండర్-7 విభాగంలో విజేతగా నిలిచాడు. రెండేళ్ల తర్వాత ప్రపంచ పాఠశాలల చెస్ పోటీల్లో అండర్-9 ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు.

12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్

2017 నుంచి సిందరోవ్ చెస్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఆ ఏడాది ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సంపాదించాడు. ఆ తర్వాతి ఏడాది ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్ మార్కును అందుకుని గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అప్పటికి అతడి వయసు కేవలం 12 ఏళ్ల 10 నెలల 8 రోజులు మాత్రమే. ఆ సమయంలో చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్ అయిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

వీడియో గేమ్స్‌తో మళ్లీ వెనుకడుగు

గ్రాండ్‌మాస్టర్ అయిన తర్వాత సిందరోవ్ ఆటపై ఏకాగ్రత తగ్గింది. మళ్లీ వీడియో గేమ్స్, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టాడు. ప్రజ్ఞానంద, అబ్దుసత్తారోవ్ వంటి సమకాలీన ఆటగాళ్లు రేటింగ్‌లో ముందుకు దూసుకెళ్తున్న సమయంలో అతడు వెనుకబడిపోయాడు. చెస్ కంటే వీడియో గేమ్స్‌లోనే విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు.

అయితే కరోనా సమయంలో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. తిరిగి చెస్‌పై దృష్టి సారించాడు. 2021లో సోచిలో జరిగిన ప్రపంచకప్‌లో 15 ఏళ్ల సిందరోవ్ సంచలనం సృష్టించాడు. అప్పట్లో 2750 రేటింగ్‌తో టాప్-10లో ఉన్న అలీరెజా ఫిరోజాను ఓడించాడు. ఈ విజయం అతడికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

భారత్‌తో ప్రత్యేక అనుబంధం

సిందరోవ్‌కు భారత్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. 2022లో చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన ఉజ్బెకిస్థాన్ జట్టులో అతడు సభ్యుడు. ఇక 2025లో గోవాలో జరిగిన ఫిడే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచి మరో ఘనత సాధించాడు. ఉజ్బెకిస్థాన్ తరఫున ఈ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ ఏడాది జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో భారత ఆటగాడు ప్రజ్ఞానందపై రెండుసార్లు విజయం సాధించాడు. ఈ విజయాలు టోర్నీలో అతడి ఆధిపత్యానికి దోహదపడ్డాయి. మొత్తం 14 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన సిందరోవ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి పాలవ్వలేదు. దీంతో క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచి గుకేశ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించాడు.

వీడియో గేమ్స్‌తో మొదలైన అతడి ప్రయాణం ఇప్పుడు ప్రపంచ చెస్ టైటిల్ వరకు చేరింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సిందరోవ్.. డిఫెండింగ్ ఛాంపియన్ గుకేశ్‌కు ఎంతటి పోటీ ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *