
భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను కోహ్లీ వెనక్కి నెట్టాడు. 561 మ్యాచులతో ఈ మైలురాయిని అధిగమించి ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 664 మ్యాచులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోహ్లీ తన అద్భుత ప్రస్థానంలో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు.
కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌ను 2008లో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించిన కోహ్లీ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన లెజెండరీ ఆటగాళ్ల సరసన నిలిచి తన స్థాయి ఏంటో మరోసారి ప్రపంచానికి నిరూపించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ 664 మ్యాచులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత శ్రీలంక మాజీ ఆటగాళ్లు మహేల జయవర్ధనే 652 మ్యాచులతో రెండో స్థానంలో, కుమార సంగక్కర 594 మ్యాచులతో మూడో స్థానంలో, సనత్ జయసూర్య 586 మ్యాచులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ.. యాక్టివ్ క్రికెటర్లలో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 538 మ్యాచులతో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.

