ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకునేందుకు ఇంటి పన్ను రసీదు తప్పనిసరి కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో బీమా నమోదు కోసం ఇంటి పన్ను రసీదు తీసుకురావాలంటూ గ్రామ కార్యదర్శులు సందేశాలు పంపడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్పష్టత ఇచ్చారు.

ఈ పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల వయసున్న కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన పత్రాలు, నామినీ వివరాలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే నమోదు ప్రక్రియలో ఇంటి పన్ను రసీదు తప్పనిసరి కాదని అధికారులు వెల్లడించడంతో లబ్ధిదారులకు ఊరట లభించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న సిద్దిపేటలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే రూ.5 లక్షల బీమా కల్పించే రైతుబీమా పథకం అమల్లో ఉండేది. అయితే దాని స్థానంలో మరింత విస్తృత లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

భూమి ఉన్నా.. లేకపోయినా అర్హులైన పేద కుటుంబాలకు బీమా భద్రత కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా అర్హత కలిగిన కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం అందించనున్నారు. పథకంలో నమోదు చేసుకున్న వ్యక్తి మరణిస్తే, ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా మొత్తాన్ని సంబంధిత నామినీ లేదా నామినీలు పొందుతారు. దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కోసం గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటి పన్నుల వసూళ్లకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.

గ్రామ వాట్సాప్ గ్రూపులో పంచాయతీ కార్యదర్శి ఒక సందేశం పోస్టు చేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చేయించుకోవాలనుకునే వారు రేషన్ కార్డు, ఫోన్ నంబర్, ఆధార్ కార్డుతో పాటు ఇంటి పన్ను రసీదు కూడా తీసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో గ్రామస్తుల్లో గందరగోళం నెలకొంది. ఇంటి పన్ను రసీదు లేకపోతే బీమా పథకంలో నమోదు చేసుకునే అవకాశం లేదా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇంటి పన్ను రసీదు తప్పనిసరి కాదు!

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి ఇంటి పన్ను రసీదు అవసరం లేదని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఎలాంటి నిబంధన విధించలేదని తెలిపారు. ఇంటి పన్ను చెల్లించకపోయినా, పన్ను రసీదు లేకపోయినా అర్హులైన వారు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

శిబిరానికి రాలేని వారికి ఇంటి వద్దే నమోదు

బీమా పథకంలో చేరాలనుకునే అర్హులైన వ్యక్తులు స్వయంగా తమ గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి హాజరై నామినీల వివరాలు అందించాలి. అనంతరం వారి వివరాలను నమోదు చేస్తారు.

అయితే దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శిబిరానికి రాలేని వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాంటి సందర్భాల్లో శిబిరం ఇన్‌ఛార్జి సంబంధిత వ్యక్తుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇంటి పన్ను రసీదు లేదనే కారణంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇంటి పన్నులు సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతుంటాయి. దీంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇంటి పన్ను రసీదు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని కొందరు మౌఖికంగా చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కొందరు బూత్ లెవల్ అధికారులు (BLOలు), ఇతర సిబ్బంది ఇంటి పన్ను రసీదు ఉంటేనే ఓటరు జాబితాలో పేరు నమోదవుతుందని చెప్పి ప్రజలను ఆందోళనకు గురిచేసినట్లు విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదులోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం విధించని నిబంధనను కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది తెరపైకి తీసుకొస్తూ ఇంటి పన్ను రసీదు తప్పనిసరి అంటూ మెలిక పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికే ఇంటి పన్ను రసీదు అవసరం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ అదే విధంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *