దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (NSEL) చెల్లింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.5,600 కోట్ల చెల్లింపుల ఎగవేత సంక్షోభానికి పరిష్కారంగా అర్హులైన పెట్టుబడిదారుల కోసం రూ.1,950 కోట్ల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS) మొత్తాన్ని విడుదల చేసినట్లు NSEL ప్రకటించింది. ముంబయిలోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఈ సెటిల్‌మెంట్ పథకానికి ఆమోదం తెలిపింది. నవంబర్ 23 నుంచి అర్హులైన క్లెయిమ్‌దారులకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది.

5,682 మంది క్లెయిమ్‌దారులకు ఊరట

NCLT ఆమోదించిన పథకం ప్రకారం మొత్తం రూ.1,950 కోట్లను సెటిల్‌మెంట్ ఖాతాలో జమ చేశారు. బాధిత పెట్టుబడిదారుల తరఫున అసైనీగా వ్యవహరిస్తున్న 63 మూన్స్ టెక్నాలజీస్‌కు ఈ మొత్తం చెల్లించారు. ఈ పథకం ద్వారా 5,682 మంది అర్హులైన క్లెయిమ్‌దారులకు ప్రయోజనం కలగనుంది.

ఈ సెటిల్‌మెంట్ ప్రతిపాదనను తొలుత బాధిత ట్రేడర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న NSEL ఇన్వెస్టర్స్ ఫోరమ్ ముందుకు తెచ్చింది. NSEL ఈ ప్రతిపాదనను అంగీకరించి పూర్తి, తుది పరిష్కారంగా ట్రైబ్యునల్ ముందు సమర్పించింది.

92.81 శాతం మంది మద్దతు

ఈ సెటిల్‌మెంట్ పథకంపై నిర్వహించిన ఓటింగ్‌లో సంఖ్యాపరంగా 92.81 శాతం మంది క్లెయిమ్‌దారులు, విలువ పరంగా 91.35 శాతం మంది మద్దతు తెలిపారు. దీంతో ముంబయి NCLT ఈ పథకానికి ఆమోదం తెలిపింది.

సెటిల్‌మెంట్‌కు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన సుమారు రూ.3,464 కోట్ల విలువైన ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 8న అనుమతి ఇచ్చింది.

17 డిఫాల్టర్ గ్రూపుల నుంచి రికవరీ

NSEL, 63 మూన్స్ టెక్నాలజీస్, వాటి ప్రమోటర్లకు డబ్బు చేరినట్లు ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆధారాలు గుర్తించలేదని NSEL పేర్కొంది. అయినప్పటికీ 63 మూన్స్ తన సొంత నిధులతో ఈ సెటిల్‌మెంట్‌ను ముందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

మరోవైపు అసలు నగదు లావాదేవీలకు సంబంధించిన ఆచూకీని 17 డిఫాల్టర్ గ్రూపుల వద్ద గుర్తించినట్లు సంస్థ తెలిపింది. వారి నుంచి బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు కొనసాగిస్తామని పేర్కొంది.

కార్పొరేట్ చరిత్రలో ప్రత్యేక పరిష్కారం: జిగ్నేశ్ షా

63 మూన్స్ టెక్నాలజీస్ మెంటర్, కోచ్ జిగ్నేశ్ షా ఈ వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ను కార్పొరేట్ భారత చరిత్రలో అపూర్వమైన పరిష్కారంగా అభివర్ణించారు. ఆర్థిక సంక్షోభాలను న్యాయబద్ధంగా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ఈ విధానం ఒక ప్రమాణంగా నిలుస్తుందని అన్నారు.

2013లో ప్రారంభమైన NSEL చెల్లింపుల సంక్షోభం కారణంగా చాలా కాలంగా తమ డబ్బు కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు ఈ పరిణామం ఊరటనిచ్చే అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *