భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ ద్వారా ఈ ఇద్దరు కలిసి భారత్ తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి జోడీగా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో వీరి తర్వాతి స్థానంలో 391 మ్యాచ్‌లతో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఓవరాల్‌గా రో-కో ఈ లిస్ట్‌లో ఆరో ప్లేసులో ఉన్నారు

భారత క్రికెట్‌ మోడ్రన్ డే లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సరికొత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే ద్వారా టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలిసి ఆడిన మొట్టమొదటి జోడీగా రో-కో నిలిచారు. ప్రతి ఏటా ఎంతో మంది యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులోకి వస్తూ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, తమ అసాధారణ నైపుణ్యం, ఫిట్‌నెస్‌తో ఈ అరుదైన రికార్డును సాధించారు.

ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకోవడానికి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ద్వయం భారత మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును అధిగమించింది. సచిన్, ద్రవిడ్ తమ కెరీర్‌లో కలిసి మొత్తం 391 అంతర్జాతీయ మ్యాచ్‌లలో టీమిండియా తరఫున మైదానంలోకి దిగారు. ఇన్నాళ్లూ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన జోడీగా ఉన్న వీరిని రోహిత్-కోహ్లీలు వెనక్కి నెట్టారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన ప్రపంచ ఆటగాళ్ల ఓవరాల్ జాబితాలో ఈ జోడీ ఆరో స్థానానికి చేరుకుంది.