భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 32,928 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన 17,981 యూనిట్లతో పోలిస్తే ఇది 83.13 శాతం వార్షిక వృద్ధి. ఒక జూలై నెలలో నమోదైన అత్యధిక EV కార్ల అమ్మకాలు ఇవే కావడం విశేషం. వరుసగా రెండో నెలలోనూ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 30,000 యూనిట్ల మార్కును దాటాయి. అయితే జూన్ 2026లో నమోదైన 33,524 యూనిట్ల రికార్డు అమ్మకాలతో పోలిస్తే జూలైలో విక్రయాలు 1.78 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, పెరుగుతున్న EV డిమాండ్‌కు తాజా గణాంకాలు బలమైన సంకేతంగా నిలుస్తున్నాయి..

జూలైలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ 13,678 EVలను విక్రయించింది. 2025 జూలైలో విక్రయించిన 6,732 యూనిట్లతో పోలిస్తే ఇది 103.18 శాతం వృద్ధి. జూన్‌లోని 12,801 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా కూడా 6.85 శాతం వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా 7,742 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో 3,416 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అమ్మకాలు 126.64 శాతం పెరిగాయి. అయితే జూన్‌లోని 8,181 యూనిట్లతో పోలిస్తే జూలైలో 5.37 శాతం తగ్గాయి. JSW MG మోటార్ 5,689 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ కంపెనీ అమ్మకాలు గతేడాది జూలైతో పోలిస్తే 3.61 శాతం, జూన్‌తో పోలిస్తే 8.03 శాతం తగ్గాయి.
జూలైలో మారుతి సుజుకి 1,600 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. జూన్‌లోని 2,000 యూనిట్లతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. VinFast India 1,482 యూనిట్లను విక్రయించింది. జూన్‌లోని 1,448 యూనిట్లతో పోలిస్తే 2.35 శాతం వృద్ధి సాధించింది. ఈ రెండు కంపెనీలకు 2025 జూలైలో నమోదైన EV కార్ల అమ్మకాల డేటా లేకపోవడంతో వార్షిక పోలిక వర్తించదు. BYD India 749 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 22.19 శాతం వృద్ధి సాధించినప్పటికీ, జూన్‌తో పోలిస్తే 19.11 శాతం తగ్గింది. హ్యుందాయ్ 566 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. వార్షికంగా 21.28 శాతం తగ్గినా, జూన్‌తో పోలిస్తే 51.34 శాతం వృద్ధి నమోదైంది. కియా 470 యూనిట్లను విక్రయించింది. గతేడాది తక్కువ బేస్ కారణంగా వార్షికంగా 623.08 శాతం భారీ వృద్ధి కనిపించింది. అయితే జూన్‌తో పోలిస్తే అమ్మకాలు 12.96 శాతం తగ్గాయి. లగ్జరీ EV విభాగంలో BMW 369 యూనిట్ల విక్రయాలతో ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 36.67 శాతం వృద్ధి. Mercedes-Benz 165 యూనిట్లతో 43.48 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. Toyota 123 యూనిట్లు, Tesla 115 యూనిట్లను విక్రయించాయి.
EV రంగంతో భారీగా ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పెరుగుదలతో పాటు దేశంలో మొత్తం EV ఎకోసిస్టమ్ కూడా విస్తరిస్తోంది. EV రంగం ద్వారా 2030 నాటికి భారత్‌లో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని Adecco India అంచనా వేసింది. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం నేరుగా కార్ల తయారీ పరిశ్రమలోనే ఉండకపోవడం ప్రత్యేకత. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ మౌలిక వసతులు, ఫ్లీట్ ఆపరేషన్స్, సాఫ్ట్‌వేర్, వాహన సర్వీసింగ్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి విభాగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. EV రంగంలో నియామకాలు ఏటా 15-20 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు డిమాండ్ సుమారు 35 శాతం పెరగవచ్చని నివేదిక పేర్కొంది.

