
రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నుంచి గోదావరిలో దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక నిందితుడైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఐదు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు మారిన అతడిని చిన్న క్లూ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.
ఆగస్టు 16న రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటన తర్వాత సాధిక్ పరారయ్యాడు. అదే రోజు అర్ధరాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు చేరుకుని జనరల్ టికెట్‌తో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. రైలులో తన ఫోన్ పోయిందని చెప్పి కాకినాడలోని ఓ లాయర్, తన సోదరితో ఫోన్‌లో మాట్లాడాడు.
ఈ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాధిక్ కదలికలను ట్రాక్ చేశారు. కర్ణాటకలోని వాడి స్టేషన్‌లో దిగినట్లు గుర్తించి అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. స్థానికుడితో అతడు మాట్లాడినట్లు గుర్తించి విచారించగా.. సోలాపూర్ వెళ్లేందుకు బస్సుల వివరాలు అడిగినట్లు వెల్లడైంది.
ఆ తర్వాత సాధిక్ పాత ఫోన్ కాంటాక్టులను పరిశీలించిన పోలీసులు సోలాపూర్‌లోని అతని స్నేహితుడి వివరాలను సేకరించారు. అతడిని విచారించగా సాధిక్‌కు లాడ్జిలో గది ఇప్పించినట్లు, అనంతరం ముంబై వెళ్లనున్నట్లు చెప్పినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలాగే ఢిల్లీలోని ఓ స్నేహితుడి నంబర్‌ను అడిగినట్లు వెల్లడించాడు.
దీంతో పోలీసులు మరో బృందాన్ని ఢిల్లీకి పంపించి దర్యాప్తు కొనసాగించారు. ఢిల్లీకి చెందిన స్నేహితుడి ద్వారా సాధిక్ మేరఠ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మరికొంత సమయం దొరికితే సాధిక్ కేరళకు చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు మారినా.. పోలీసులు పక్కా ప్రణాళికతో దర్యాప్తు కొనసాగించి చివరకు అతడిని పట్టుకున్నారు.

