
గంపలగూడెం, ఆగస్టు 25 ఈగల్ 2.0 కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించిన 25 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు ఎస్సై జి.అనిల్ తెలిపారు. పరీక్షల్లో ముగ్గురికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై దాని ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై తెలిపారు.
యువత గంజాయి సహా అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం, సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మండల పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై జి.అనిల్ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని వెల్లడించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

