ఏపీ హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ లీసా గిల్‌ రానున్నారు. ఆమె ప్రస్తుతం పంజాబ్‌- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే ఆమె ఏపీ హైకోర్టుకు రానున్నారు. ప్రస్తుత సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌‌ పదవీ కాలంలో ఏప్రిల్ నెలలో ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ మహిళా న్యాయమూర్తి రాబోతున్నారు. హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ లిసా గిల్‌ రానున్నారు. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గిల్‌ పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండు నెలలు ముందుగానే బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ లిసా గిల్‌ ప్రస్తుత ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన మరుసటిరోజు నుంచి సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీం కోర్టు కొలీజయం సిఫార్సు చేసింది. లిసా గిల్ ప్రస్తుతం పంజాబ్‌-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా (సీనియార్టీ పరంగా మూడోస్థానంలో) ఉన్నారు.

లిసా గిల్ స్వస్థలం చండీగఢ్‌. ఆమె కార్మెల్‌ కాన్వెంట్‌‌లో చదివారు. అనంతరం హ్యూమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసిన లిసా గిల్.. 1990లో లాయర్‌గా పేరు నమోదు చేసుకొని, పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2014 మార్చి 31న లిసా గిల్ పంజాబ్‌-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు.