30 ఏళ్ల దినసరి కూలీకి అరుదైన గుండె లయ సమస్య (Ventricular Premature Complexes) తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఖరీదైన చికిత్సను భరించే స్థోమత లేకపోవడంతో అతడు నిమ్స్‌ను ఆశ్రయించాడు. పరిస్థితిని గుర్తించిన నిమ్స్ వైద్యులు అత్యాధునిక 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి సంక్లిష్టమైన రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కరోనరీ ధమని సమీపంలో ఉన్న ప్రమాదకరమైన అసాధారణ గుండె లయ కేంద్రాన్ని అత్యంత జాగ్రత్తగా గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ప్రాణరక్షక చికిత్సను ఉచితంగా అందించడంతో ఆ పేద యువకుడికి కొత్త జీవితం లభించింది.

పేదరికం ఓ వైపు.. ప్రాణాలకు ముప్పుగా మారిన అరుదైన గుండె సమస్య మరోవైపు.. తెలంగాణకు చెందిన 30 ఏళ్ల దినసరి కూలీకి రెండేళ్లుగా ఇదే పరిస్థితి. కష్టపడి పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయాసం, తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అతడు పలు ఆసుపత్రులను సంప్రదించాడు. పరీక్షల్లో వెంటిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ (VPCs) అనే అరుదైన గుండె లయ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌కు లక్షల రూపాయలు ఖర్చవుతుండటంతో ఆ మొత్తాన్ని భరించే స్థోమత లేక చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ను ఆశ్రయించాడు.
నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ. సాయి సతీష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం అతడికి హోల్టర్ మానిటరింగ్ నిర్వహించగా.. గుండెలో 57 శాతం అసాధారణ హృదయ స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిర్వహించిన 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్‌లో ఈ అసాధారణ విద్యుత్ కేంద్రం ఎడమ కరోనరీ ధమనికి అత్యంత సమీపంలో ఉన్నట్లు తేలింది. దీంతో చికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. ఏమాత్రం పొరపాటు జరిగినా కీలకమైన కరోనరీ ధమనికి నష్టం కలిగి ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సవాలును ఎదుర్కొన్న నిమ్స్ వైద్యులు ముందుగా కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా ధమని స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించారు. అనంతరం 3D మ్యాపింగ్ సాయంతో ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ (EPS), రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) విజయవంతంగా నిర్వహించారు. కరోనరీ ధమనికి ఎలాంటి నష్టం కలగకుండా అసాధారణ స్పందనలకు కారణమైన విద్యుత్ కేంద్రాన్ని నిర్వీర్యం చేశారు.
లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం కింద నిమ్స్‌లో ఉచితంగా అందించారు. దీంతో నిరుపేద దినసరి కూలీకి గుండె సమస్య నుంచి ఉపశమనం లభించి కొత్త జీవితం లభించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో ఇలాంటి అత్యాధునిక EPS+RFA చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి నిమ్స్ అని వైద్యులు తెలిపారు. తరచూ గుండె దడ, ఆయాసం, ఛాతీలో అసౌకర్యం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన హోల్టర్, ఎకో, గుండె MRI వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
