
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ RC17పై కీలక సమాచారం బయటకు వచ్చింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి కలవడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, ‘పుష్ప 2’ వంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్‌కు పూర్తి కథను వివరించే ఫైనల్ నెరేషన్ ఇంకా జరగాల్సి ఉందని సమాచారం. త్వరలోనే చరణ్‌కు స్క్రిప్ట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెరేషన్ పూర్తయిన తర్వాతే సినిమాకు సంబంధించిన కీలక అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర నటీనటుల ఎంపిక, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని టాక్.
ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. దసరా సందర్భంగా RC17 పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించి, నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా కథ, మేకింగ్ భారీ స్థాయిలో ఉండటంతో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమేనని, పరిస్థితులు అనుకూలిస్తే 2028లో RC17 విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలోనే సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ ప్రారంభ తేదీపై మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ‘రంగస్థలం’తో సంచలనం సృష్టించిన చరణ్-సుకుమార్ కాంబో.. ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
