
భారీ స్టార్ కాస్ట్ లేదు.. పెద్దగా ప్రచారం కూడా లేదు. అయినా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్ (Hanuman Ansh)’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ఐదో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.
సాక్నిల్క్ నివేదికల ప్రకారం 32వ రోజున ఈ సినిమా దేశవ్యాప్తంగా 7,343 షోల ద్వారా దాదాపు రూ.10 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.156.20 కోట్లకు చేరగా, నెట్ వసూళ్లు రూ.132.13 కోట్లుగా నమోదయ్యాయి.
ఐదో సోమవారం కూడా సినిమాకు మంచి స్పందన లభించింది. రోజంతా సగటున 34.63 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా రాత్రి షోలకు 51.31 శాతం ఆక్యుపెన్సీ రావడం సినిమాకు ఉన్న ఆదరణను చూపిస్తోంది.
అసలు ఈ సినిమా కథేంటి?
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, ఆయన బోధనలు, భక్తుల అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి.. దేవుడిని కలిస్తే తన తల్లిని తిరిగి చూడొచ్చనే నమ్మకంతో చేసే అన్వేషణ చుట్టూ కథ సాగుతుంది.
ఆ ప్రయాణంలో ప్రేమ, సేవ, ఇతరులకు సహాయం చేయడమే నిజమైన ఆధ్యాత్మికత అనే విషయాన్ని బాలుడు తెలుసుకుంటాడు. శోభినావ్ సత్య ‘మహారాజ్-జీ’ పాత్రలో నటించగా, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెడ్గే కీలక పాత్రలు పోషించారు.
హింస, అశ్లీలత లేకపోవడంతో ఈ కుటుంబ కథా చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాకు భారీగా కలిసొచ్చింది.
ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ హిందీలో మాత్రమే విడుదలైంది. త్వరలో తెలుగు సహా ఇతర భాషల్లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. చిన్న బడ్జెట్‌తో మొదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
