
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రెజిమెంట్‌లో గతంలో పనిచేసిన హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజుతో పాటు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఆగస్టు 31న బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ చోరీకి గురయ్యాయి. ఘటనపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు డాగ్ స్క్వాడ్, వేలిముద్రలను పరిశీలించారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్న వ్యక్తులపై మొదట దృష్టి సారించారు. ఆయుధాలను రెగ్యులర్‌గా ఉపయోగించే 16 మందిని గుర్తించి వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ క్రమంలో హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజుపై పోలీసులకు అనుమానం బలపడింది. అతడి కదలికలను నిశితంగా పరిశీలించిన అనంతరం విచారణ చేపట్టగా, చివరకు తన భార్య నిలదీయడంతో చోరీ చేసినట్లు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు.
చోరీ చేసిన ఆయుధాలు, ఇతర సామగ్రిని మల్లేశ్ తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి తీసుకెళ్లి, అక్కడ గుంత తీసి పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయుధాల చోరీ వెనుక ఉన్న పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
