
సాధారణంగా మనుషులు కనిపించకుండా పోయినా, పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం, పత్రికల్లో ‘మిస్సింగ్’ ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ బీహార్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
‘మా బడి కనిపించడం లేదు’ అంటూ ఓ గ్రామానికి చెందిన ప్రజలంతా అధికారులను ఆశ్రయించారు. తొలుత ఇది వింతగా అనిపించినా, అసలు విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. పాఠశాల పేరుతో జరిగిన ఈ విచిత్రమైన స్కామ్ వెనుక అసలు కథ ఏమిటి? గ్రామస్తులు బడి కనిపించడం లేదంటూ ఎందుకు ఫిర్యాదు చేశారు? బీహార్‌లో వెలుగుచూసిన ఈ సంచలన మోసం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
‘రాజావారి చేపల చెరువు’ సినిమాలో రాజకీయ నాయకులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చూపించిన సన్నివేశాలు గుర్తుండే ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటననే ఇప్పుడు బీహార్‌లోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా తమ గ్రామంలోని పాఠశాలే కనిపించడం లేదంటూ గ్రామస్తులు అధికారులను ఆశ్రయించారు.
బీహార్‌లోని ప్రాణ్‌పుర్ తాలూకా దీఘాపార్ గ్రామానికి చెందిన ప్రజలు డప్పు చప్పుళ్లతో భారీ ఊరేగింపుగా ఉన్నతాధికారుల కార్యాలయానికి చేరుకున్నారు. ‘సార్.. మా స్కూల్ మాయమైపోయింది. దయచేసి మా పాఠశాలను వెతికి పట్టుకుని మాకు న్యాయం చేయండి’ అంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
అసలు విషయం ఏమిటంటే.. గ్రామంలోని పాత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా రూ.44.85 లక్షలు మంజూరు చేశారు. అంతేకాదు.. నిర్మాణ పనులకు సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయి. విచిత్రంగా, పాఠశాల భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారికంగా ధ్రువీకరిస్తూ కంప్లీషన్ సర్టిఫికెట్ సైతం జారీ చేశారు.
టెండర్ ప్రకారం పాఠశాల నిర్మాణానికి కేటాయించిన రూ.44.85 లక్షలను మూడు విడతల్లో చెల్లించినట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. 2024 ఏప్రిల్ 18న మొదటి విడతగా రూ.15 లక్షలు, సెప్టెంబర్ 28న రెండో విడతగా మరో రూ.15 లక్షలు చెల్లించారు. చివరి విడతగా 2025 మార్చి 12న రూ.14.85 లక్షలు విడుదల చేశారు. దీంతో మొత్తం రూ.44.85 లక్షల చెల్లింపు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదైంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 2025 మార్చి 25న పాఠశాల నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారికంగా కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం.. ‘స్కూల్ భవనం ఎక్కడ?’ అని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు విడుదలయ్యాయి.. బిల్లులు చెల్లించారు.. పనులు పూర్తయ్యాయని సర్టిఫికెట్ ఇచ్చారు.. కానీ క్షేత్రస్థాయిలో పాఠశాల భవనం మాత్రం కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
రూ.44.85 లక్షలు ఖర్చయినట్లు రికార్డులు చెబుతుంటే.. తమ కళ్ల ముందు మాత్రం స్కూల్ కనిపించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసలు పాఠశాల నిర్మాణం కోసం విడుదలైన నిధులు ఎక్కడికి వెళ్లాయో తేలాల్సి ఉంది.
