
న్యూఢిల్లీలో సెప్టెంబరు 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. సదస్సు తొలిరోజు నిర్వహించిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి సంబంధించిన అడ్డంకులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు దేశాల మధ్య సహకారం, అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాణిజ్య అడ్డంకులను అధిగమించేందుకు భారత్ తన వంతుగా ‘వంతెనలు నిర్మించే’ ప్రయత్నం చేస్తుందని బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నిబంధనలు కఠినతరమవుతూ, సుంకాలు, ఆంక్షలు పెరిగి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విభజన దిశగా సాగుతున్న నేపథ్యంలో భారత్ దేశాల మధ్య ‘వ్యూహాత్మక వారధి’గా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ‘బిజినెస్ ఫోరమ్’ నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) ద్వారా వాణిజ్య అవకాశాలను విస్తరించడం, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం ద్వారా భారత్ ప్రపంచ వాణిజ్యానికి స్థిరత్వాన్ని అందిస్తోందని ప్రధాని తెలిపారు.
ఆర్థిక వారధుల నిర్మాణం.. స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రాధాన్యం
ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నప్పటికీ, భారత్ మాత్రం పారదర్శకత, సహకారం, స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని మోదీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న సమయంలో భారత్ ఆర్థిక వారధులను నిర్మించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు.
“2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 40 దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వాణిజ్య ప్రతిబంధకాలను తగ్గించడం, మార్కెట్లను మరింత అందుబాటులోకి తీసుకురావడం, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడమే మా ప్రధాన లక్ష్యం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులు పెరుగుతున్న తరుణంలో పరస్పర సహకారం, బలమైన సరఫరా గొలుసులు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే ఆర్థిక స్థిరత్వానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. ప్రభుత్వాల మధ్య సహకారానికే పరిమితం కాకుండా MSMEలు, స్టార్టప్‌లకు అంతర్జాతీయ మార్కెట్లు, నిధులు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఇందులో భాగంగా బ్రిక్స్ ఇన్క్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ MSME పోర్టల్, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ అనే మూడు కీలక కార్యక్రమాలను భారత్ ప్రారంభించింది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్లు వంటి ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల పరస్పర మార్పిడిని మరింత పెంచాలని ప్రధాని మోదీ బ్రిక్స్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
