ఇంటి బాల్కనీలు, మేడలు లేదా గోడల సందుల్లో రావి మొక్కలు మొలకెత్తడం చాలాచోట్ల కనిపిస్తుంటుంది. సనాతన ధర్మంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు. అయితే ఇంటి గోడలు, నిర్మాణాల మధ్య పెరిగే రావి మొక్కల వేర్లు క్రమంగా విస్తరించడం వల్ల గోడలు, పునాదులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో మతపరమైన విశ్వాసాల కారణంగా రావి చెట్టును నేరుగా నరికేందుకు చాలామంది ఇష్టపడరు. అందుకే మొక్కను పూర్తిగా తొలగించడంతో పాటు గోడలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మరి ఇంటి గోడలు, బాల్కనీలు లేదా మేడల్లో మొలిచిన రావి మొక్కను సురక్షితంగా ఎలా తొలగించాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా ఇళ్లలో బాల్కనీలు, పగుళ్లు ఉన్న గోడలు, మేడ భాగాలు లేదా ఇతర నిర్మాణాల సందుల్లో అనుకోకుండా రావి మొక్కలు మొలవడం చూస్తుంటాం. హిందూ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అయితే ఇంటి గోడలు, భవన నిర్మాణాల మధ్య రావి మొక్క పెరిగితే.. దాని వేళ్లు క్రమంగా విస్తరించి గోడలు, పునాదులకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. వాస్తు పరంగా కూడా ఇంటి నిర్మాణంలో రావి చెట్టు పెరగడం మంచిది కాదనే నమ్మకాలు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో మొక్కను విచక్షణారహితంగా నరికివేయకుండా, మత విశ్వాసాలను గౌరవిస్తూనే ఇంటి నిర్మాణానికి నష్టం కలగకుండా ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేళ్లతో సహా జాగ్రత్తగా తొలగించాలి
రావి మొక్క వేళ్లు బలంగా, విస్తృతంగా పెరిగే స్వభావం కలిగి ఉంటాయి. కేవలం పైభాగాన్ని నరికివేస్తే.. మిగిలిన వేళ్ల నుంచి మళ్లీ మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మొక్క చుట్టూ ఉన్న మట్టి లేదా గోడలోని సందును వీలైనంత జాగ్రత్తగా తొలగించి, వేళ్లను కూడా పూర్తిగా బయటకు తీసే ప్రయత్నం చేయాలి. గోడకు లేదా నిర్మాణానికి నష్టం కలగకుండా ఈ ప్రక్రియను నిపుణుల సహాయంతో చేయడం మరింత సురక్షితం.
మట్టి గట్టిగా ఉండి, మొక్కను తొలగించడం కష్టంగా అనిపిస్తే కొద్దిగా నీరు పోసి మట్టిని మెత్తగా చేయాలి. ఆ తర్వాత వేళ్లు వదులయ్యే వరకు కొంతసేపు వేచి చూసి, మొక్కకు ఎలాంటి నష్టం కలగకుండా సున్నితంగా బయటకు తీయాలి.
రీ-పాటింగ్ లేదా వేరే చోట నాటడం: రావి చెట్టును నరికివేయడం లేదా నిర్లక్ష్యంగా పడేయడం కంటే, తొలగించిన మొక్కను మరో చోట నాటడం మంచిదని పెద్దలు చెబుతారు. వీలైతే దానిని ఒక కుండీలో నాటి కొన్ని రోజులు పెంచుకోవచ్చు. లేదా ఇంటికి దూరంగా ఉన్న పార్కు, ఆలయ ప్రాంగణం వంటి అనువైన ప్రదేశంలో నాటి నీరు పోయవచ్చు. ఇలా చేయడం ద్వారా మొక్కను సంరక్షించడంతో పాటు, ఆధ్యాత్మిక విశ్వాసాలను కూడా గౌరవించినట్లవుతుంది.
మతపరమైన, వాస్తు విశ్వాసాలు
రావి మొక్కను తొలగించే విషయంలో కొన్ని మతపరమైన ఆచారాలను పాటించడం మంచిదని పెద్దలు సూచిస్తారు.
శనివారం అనుకూలమని నమ్మకం: రావి మొక్కను తొలగించడానికి శనివారం రోజును అనుకూలమైనదిగా కొందరు భావిస్తారు.
నమస్కరించి క్షమాపణ కోరడం: మొక్కను తొలగించే ముందు దానికి నమస్కరించి, ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానిని మరో ప్రదేశానికి తరలిస్తున్నామని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు.
నీరు పోసి దీపం వెలిగించడం: మొక్కను మరోచోట నాటిన తర్వాత దానికి నీరు పోసి, సమీపంలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావించే సంప్రదాయం కూడా ఉంది.
ఇలా ఇంటి నిర్మాణానికి కలిగే ఇబ్బందులను నివారించడంతో పాటు, రావి చెట్టుపై ఉన్న మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తూ మొక్కను మరో ప్రదేశానికి తరలించవచ్చు. అయితే శనివారం వంటి రోజులు, దీపం వెలిగించడం వంటి అంశాలు మతపరమైన విశ్వాసాలకు సంబంధించినవే తప్ప శాస్త్రీయంగా నిర్ధారించబడిన నియమాలు కావు.
