చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యానికి పాలు ముఖ్యమైన పోషకాహారం. తల్లిపాలు అందుబాటులో లేని సందర్భాల్లో లేదా వైద్యుల సూచన మేరకు కొంతమంది తల్లిదండ్రులు బాటిల్‌ ద్వారా పాలు ఇస్తుంటారు. అయితే, బాటిల్‌తో పాలు తాగించే సమయంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు శిశువులకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని బాలల నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే చిన్నారులకు బాటిల్‌తో పాలు తాగించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా నివారించాల్సిన 4 సాధారణ పొరపాట్లు ఇవే:

చిన్నారులకు సీసా ద్వారా పాలు తాగించేటప్పుడు తల్లిదండ్రులు తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా బాటిల్‌ను సరైన విధంగా పట్టుకోకపోవడం, పాలు తాగిన తర్వాత తేన్పు (burping) తీర్చకపోవడం వంటి కారణాలతో శిశువులకు గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం లేదా వాంతులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పిడియాట్రీషియన్స్ సూచనల ప్రకారం.. బాటిల్ ఫీడింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ 4 పొరపాట్లకు దూరంగా ఉండాలి. అవేంటంటే..

1. పాలు తాగించే పొజిషన్ సరిగ్గా లేకపోవడం

బాటిల్‌తో పాలు ఇస్తున్నప్పుడు శిశువు తల, మెడను సౌకర్యంగా సపోర్ట్ చేస్తూ, బాటిల్‌ను సరైన కోణంలో పట్టుకోవాలి. సీసాను పూర్తిగా సమాంతరంగా ఉంచితే నిపుల్‌లోకి పాలు సరిగా రాకపోవడంతో పాటు గాలి కూడా శిశువు నోటిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది పిల్లల్లో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కనిపించవచ్చు. అందువల్ల నిపుల్ భాగం పాలతో నిండి ఉండేలా బాటిల్‌ను స్వల్పంగా వంచి పట్టుకోవడం మంచిది.

2. పాలు తాగిన తర్వాత తేన్పు తీర్చకపోవడం

పాలు తాగించడం పూర్తయిన వెంటనే శిశువును పడుకోబెట్టడం కంటే, కొద్దిసేపు నిటారుగా పట్టుకుని తేన్పు వచ్చేలా చేయడం మంచిది. పాలు తాగే సమయంలో కడుపులోకి వెళ్లిన గాలి బయటకు రావడానికి ఇది సహాయపడుతుంది. సాధారణంగా శిశువును భుజంపై సపోర్ట్‌గా ఉంచి వీపుపై మృదువుగా తట్టడం లేదా నిమరడం ద్వారా తేన్పు తీర్చవచ్చు.

3. బాటిల్ నోట్లో పెట్టి పడుకోబెట్టడం

పిల్లలు త్వరగా నిద్రపోవాలనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు బాటిల్‌ను నోట్లోనే ఉంచి పడుకోబెడుతుంటారు. అయితే ఈ అలవాటు శిశువులకు ప్రమాదకరంగా మారవచ్చు. పాలు చెవి వైపు వెళ్లడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. అలాగే నోట్లో పాలు ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల చిన్న వయసులోనే దంతక్షయం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, పాలు పొరపాటున శ్వాసనాళాల్లోకి వెళ్లి శ్వాసకు ఇబ్బంది కలిగించే ప్రమాదం కూడా ఉంది.

4. బలవంతంగా పాలు తాగించడం

బాటిల్‌లో ఉన్న పాలు పూర్తిగా తాగించాలనే ఉద్దేశంతో పిల్లలను బలవంతం చేయకూడదు. కడుపు నిండినప్పుడు పిల్లలు తల తిప్పడం, నోరు మూసుకోవడం వంటి సంకేతాలు ఇస్తే పాలు ఇవ్వడం ఆపేయాలి. బలవంతంగా తాగిస్తే అసౌకర్యంతో పాటు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు బాటిల్‌తో పాలు ఇచ్చే సమయంలో వారి సంకేతాలను గమనిస్తూ, సురక్షితమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *