
సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 1980–90 దశకం నేపథ్యంతో సాగే ఎమోషనల్ కథగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన చిత్రాలపై టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘కంగువా’, ‘రెట్రో’ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో సూర్యతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో వెంకీ అట్లూరి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. దీంతో ఆయనతో సినిమాలు తీసేందుకు ఎంతోమంది హీరోలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి కలయికలో రూపొందుతున్న సూర్య 46వ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది.

