
బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మూడు, నాలుగు రోజుల్లో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశముంది.
ఈ నెల 21వ తేదీ ఉదయానికి అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే సమయంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా. అనంతరం 22వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే తుఫాన్ ఏర్పాటుపై 21వ తేదీ నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ వ్యవస్థ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పరిసరాలు, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 22, 23 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
నేడు పలు జిల్లాల్లో వర్షాలు
అల్పపీడన ప్రభావానికి తోడు రాష్ట్రంలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు జిల్లాలకు అలర్ట్‌లు
శుక్రవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుని, తొండంగి, పాయకరావుపేట, కొత్తవలస మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దర్శి, అద్దంకి, వినుకొండ, కురిచేడు పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
