
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21న ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని లీలా ప్యాలెస్ నుంచి బయలుదేరి హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
ఉదయం 10:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు. 10:55 గంటలకు గుండిశెట్టిపల్లి గ్రామంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వద్ద నిర్వహించే జల హారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 11:30 గంటలకు కుప్పం బైపాస్ రోడ్డులో ఇండేన్ గ్యాస్ గోడౌన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న రైతు బజార్‌కు శంకుస్థాపన చేస్తారు.
11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు శాంతిపురం మండలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుప్పం పట్టణంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల గ్యాలరీని సీఎం సందర్శించనున్నారు.
