ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు అధికారులు మరోసారి అలర్ట్ జారీ చేశారు. ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ అప్డేట్ సేవలను ఉచితంగా అందించనున్నారు.

ఐదేళ్ల నుంచి ఏడేళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల జాబితాలను ఇప్పటికే సంబంధిత పాఠశాలలకు పంపించిన అధికారులు.. మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆధార్ వివరాల అప్డేట్‌తో పాటు పిల్లలకు కొత్త ఆధార్ కార్డు కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇందుకోసం పిల్లల జనన ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి. ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం జనన ధ్రువపత్రం, పదో తరగతి మార్కుల జాబితా, చిరునామా ధ్రువపత్రాలు అవసరమవుతాయి.

గతేడాది కూడా రాష్ట్రంలో విద్యార్థుల ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా చాలామంది విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఏడాది కూడా విడతలవారీగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *