కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా శుక్రవారం సాయంత్రం కర్ణాటకకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హుబ్బళ్లిలోని 1,200 పడకల మెడికల్ కాలేజీ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే హోటల్‌లో బస చేసిన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్న అమిత్ షా, ఆసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు.

కర్ణాటక పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యుల సూచన మేరకు హుబ్బళ్లిలోని హోటల్‌కే పరిమితమయ్యారు. ఆరోగ్య పరిస్థితి కారణంగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు.

హుబ్బళ్లిలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ వైద్య కళాశాల భవనంతోపాటు, 1,200 పడకల కేఎల్‌ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను శనివారం అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రే హుబ్బళ్లికి చేరుకున్నారు.

అయితే, అనారోగ్యానికి గురైన నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కలిసి ఈ రెండు సంస్థలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ, కేఎల్‌ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాల వల్ల కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

కాగా, హుబ్బళ్లి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సాదర స్వాగతం పలికారు. ఉత్తర కర్ణాటకలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలకు కేఎల్‌ఈ సొసైటీకి చెందిన ఈ సంస్థలు మరింత బలోపేతాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

‘‘హుబ్బళ్లి విమానాశ్రయానికి విచ్చేసిన గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సాదర స్వాగతం. ఉత్తర కర్ణాటకలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించనున్న కేఎల్‌ఈ సొసైటీకి చెందిన జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కాలేజ్ (జేజీఎంఎంఎంసీ), హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఆయన హుబ్బళ్లికి విచ్చేశారు’’ అని ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో పోస్టు చేశారు.

సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించారు. 30 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. వైద్య విద్యతో పాటు అధునాతన ఆరోగ్య సేవలు, డయాగ్నోస్టిక్స్, చికిత్స, వైద్య పరిశోధనలను మరింత బలోపేతం చేయడం ఈ సంస్థల ప్రధాన లక్ష్యంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *