
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులపై చదువు, పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ‘కేర్ ఏపీ’ టూల్ ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు.
తొలి విడతలో 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ అందించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం 2 వేల మంది ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘మిషన్ మార్చ్’ను సమర్థంగా అమలు చేసి పదో తరగతి ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు.
యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతం పెంచేందుకు ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయాలని తెలిపారు. ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
