కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయానికి రక్షణశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (NOC) మంజూరైంది. దీంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటుకు మొత్తం 1,848 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే సుమారు 800 ఎకరాలకు పరిహారం చెల్లించారు. మిగిలిన భూమి సేకరణకు సుమారు రూ.163 కోట్లు అవసరమని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు విడుదలైన వెంటనే మిగిలిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

మొత్తం భూమిలో సుమారు 900 ఎకరాలను వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానంగా రెండు అప్రోచ్‌ రోడ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కుప్పం పరిధిలోని రామకుప్పం, శాంతిపురం మండలాలతో పాటు గుడుపల్లె మండలంలోని పొగురుపల్లి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. బెంగళూరు, చెన్నై, కేజీఎఫ్‌, కృష్ణగిరి ప్రాంతాలతో కుప్పానికి మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పిస్తున్నట్లు తెలిపారు. కుప్పం నుంచి పొగురుపల్లి మీదుగా బెంగళూరుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణంతో పాటు చిత్తూరు-కుప్పం బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ కనెక్టివిటీ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *