అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్‌పై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ అమరావతి సచివాలయంలో సమావేశమై.. కేసుల పురోగతి, బాధితులకు పరిహారం, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

సమావేశంలో ముఖ్యంగా అగ్రిగోల్డ్‌ ప్లాట్లకు సంబంధించిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 35,544 మంది బాధితులకు తొలి విడతలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే డబ్బులు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్‌ జరగని మరో 6,989 మంది బాధితులకు రెండో విడతలో పరిష్కారం కల్పించాలని నిర్ణయించారు.

బాధితుల నుంచి అగ్రిగోల్డ్‌ బాండ్ల వివరాలను సేకరించేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తం 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏపీలో 7, తెలంగాణలో 3 బృందాలు, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మరో 10 బృందాలు పనిచేయనున్నాయి. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల నుంచి ఒరిజినల్‌ బాండ్లను పరిశీలించి, వాటి జిరాక్స్‌ ప్రతులను సేకరించనున్నాయి.

అగ్రిగోల్డ్‌ భూముల్లో గతంలో చేపట్టిన మొక్కల పెంపకంపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా భూముల్లో అటవీశాఖ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి ప్లాంటేషన్‌ను ఆడిట్‌ చేయించాలని నిర్ణయించారు. మున్సిపల్‌ పరిధిలో అగ్రిగోల్డ్‌ వేసిన లేఅవుట్ల ప్రస్తుత పరిస్థితిపై కూడా మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఇకపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశాలను తరచూ నిర్వహించి సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *