న్యూఢిల్లీ, నవంబర్ 21,

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం నగరంలో గాలి నాణ్యత ‘పూర్‌’ (నాసిరకం) కేటగిరీలో నమోదైంది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 279గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏఐఐఎంఎస్‌ ప్రాంతంలో అత్యధికంగా 369, చాందినీ చౌక్‌లో 365 ఏక్యూఐ నమోదైంది. వజీర్‌పూర్‌లో 332, ఆనంద్‌ విహార్‌లో 327, ఐఐటీ ఢిల్లీలో 308, బవానాలో 304గా నమోదయ్యాయి. ఈ ప్రాంతాలన్నీ ‘వెరీ పూర్‌’ (అత్యంత నాసిరకం) కేటగిరీలో ఉన్నాయి.

ఇక ఆర్‌కే పురంలో 274, నజఫ్‌గఢ్‌లో 236, నరేలాలో 245, ద్వారక సెక్టార్‌-8లో 241, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-3 వద్ద 242 ఏక్యూఐ నమోదైంది. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘పూర్‌’ కేటగిరీలో కొనసాగుతోంది.

ఏక్యూఐ స్థాయులు ఇవీ..

సీపీసీబీ వర్గీకరణ ప్రకారం ఏక్యూఐ 0-50 మధ్య ఉంటే మంచి గాలి నాణ్యతగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మధ్య మధ్యస్థంగా పరిగణిస్తారు. 201-300 మధ్య నాసిరకంగా, 301-400 మధ్య అత్యంత నాసిరకంగా, 401-500 మధ్య తీవ్ర కాలుష్య స్థాయిగా గుర్తిస్తారు.

గ్రాప్‌-3 ఆంక్షలు ఎత్తివేత

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గాలి నాణ్యత కొంత మెరుగుపడటంతో నవంబర్‌ 17న గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (గ్రాప్‌) మూడో దశ ఆంక్షలను వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ (సీఏక్యూఎం) ఎత్తివేసింది. ఈ మేరకు గ్రాప్‌ ఉపకమిటీ నిర్ణయం తీసుకుంది.

ఆంక్షల సడలింపుతో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులందరికీ ప్రత్యక్ష తరగతులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాజా ఏక్యూఐ గణాంకాలు రాజధానిలో వాయు కాలుష్య సమస్య ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *