రామగిరి, నవంబర్‌ 20: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నదని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు. నాగార్జునసాగర్‌ విజయపురి, పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పనులు కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.

శుక్రవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పేరుతో చేపడుతున్న నీటి తరలింపు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎనిమిది నెలలుగా పనులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

కృష్ణా జలాల విషయంలో విభజన చట్టాన్ని అమలు చేసి తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను తక్షణమే తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రధాని మోదీ అండతోనే చంద్రబాబు నీటి తరలింపు వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ నీటి హక్కులకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. ఏపీ పాలకుల వైఖరితోపాటు తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *