ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఏర్పాటు చేయాలనుకున్న ఏఎం ఏఐ ఫ్యాక్టరీ ప్రాజెక్టును ఓర్వకల్లుకు తరలించేందుకు అనుమతించింది. 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు రూ.37,187 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ డేటా సెంటర్ కోసం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో 250 ఎకరాలు కేటాయించనున్నారు. గతంలో ప్రకటించిన రాయితీలను కూడా కొత్త ప్రాంతానికి బదలాయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

డిక్సన్ టెక్నాలజీస్‌కు గ్రీన్‌సిగ్నల్

తిరుపతి జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 (ఈఎంసీ)లో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందుకోసం రాయితీ ధరకు భూమి కేటాయించడంతో పాటు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

టిచ్‌మింట్‌కు కూడా అనుమతులు

ఇదే క్లస్టర్‌లో టిచ్‌మింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.55 కోట్ల పెట్టుబడితో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపి రాయితీలు ప్రకటించింది.

పెట్టుబడుల కేంద్రంగా ఏపీ

విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులతో పాటు వేలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమవుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *