ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Rt.No.1843 ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

2012-2016 కాలానికి సంబంధించిన నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నవంబర్ 2026లో విజయవాడలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 2017-2024, 2025 సంవత్సరాల నంది అవార్డుల కోసం జ్యూరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.

2017-2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన అవార్డు విజేతల జాబితాను నవంబర్ 2026లో అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఫిల్మ్ విభాగంలో మొదటి, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌లతో పాటు రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు.

టీవీ విభాగంలోనూ 2017-2024 కాలానికి ప్రతి ఏడాది మొదటి, రెండో ఉత్తమ మెగా సీరియళ్లతో పాటు రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2017-2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 2026లో అమరావతి లేదా విజయవాడలో నిర్వహించనున్నారు. నంది టీవీ అవార్డుల వేడుకను అదే నెలలో తిరుపతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఏపీలో దాదాపు దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవాలకు మార్గం సుగమమైంది. సినీ, టీవీ రంగాలకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణుల్లో ఈ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *