
తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఈ అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 275 ఎస్సై పోస్టుల భర్తీ కోసం నవంబర్ 29న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 335 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
అభ్యర్థులు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీజీఎస్ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే హాల్‌టికెట్లు పొందాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో 275 ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి నవంబర్ 29న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
ఈసారి అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మూడు భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించారు. వీరిలో అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోగా, 43.02 శాతం మంది ఇంగ్లిష్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక ఉర్దూ మాధ్యమంలో పరీక్ష రాసేందుకు 0.12 శాతం మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు.
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది విధానంలో తమ హాల్‌టికెట్లను పొందవచ్చు.
- ముందుగా టీజీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ http://www.tgprb.in ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
- స్క్రీన్‌పై కనిపించే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
- హాల్‌టికెట్‌పై సూచించిన ప్రదేశంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలి.
పరీక్షకు వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హాల్‌టికెట్‌పై ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని నియామక మండలి స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- హాల్‌టికెట్‌పై పేర్కొన్న పరీక్ష కేంద్రం, చిరునామా, పరీక్ష సమయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి.
- పరీక్ష రోజున హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి.
- మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలి.
చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించి కేటగిరీల వారీగా కాకుండా పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఎస్సై (సివిల్) – 148
- ఎస్సై (ఆర్మ్‌డ్ రిజర్వ్) – 14
- ఎస్సై (టీజీఎస్పీ) – 12
- ఎస్సై (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) – 3
- ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23
కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు
ఈసారి ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల కేటగిరీలను బట్టి కనీస అర్హత మార్కులను నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించాలంటే అభ్యర్థులు కింది మార్కులు తప్పనిసరిగా పొందాలి.
- ఓసీ, ఈడబ్ల్యూఎస్: 30 శాతం – 60 మార్కులు
- బీసీ: 25 శాతం – 50 మార్కులు
- ఎస్సీ, ఎస్టీ: 20 శాతం – 40 మార్కులు
- మాజీ సైనికులు, హోంగార్డులు: 20 శాతం – 40 మార్కులు
గత నోటిఫికేషన్‌తో పోలిస్తే మార్పులు
2022లో విడుదలైన పోలీస్ నియామక నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి కనీస అర్హత మార్కుల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ప్రిలిమినరీ పరీక్షలో నిర్ణీత కనీస మార్కులు సాధించినంత మాత్రాన ఉద్యోగానికి ఎంపికైనట్లు కాదని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు తదుపరి దశలో నిర్వహించే ఫిజికల్ టెస్టులతో పాటు ఇతర ఎంపిక ప్రక్రియల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది.
