పండుగల వేళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను అరికట్టేందుకు జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నిషేధిత నిబంధనలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగిన ఈ ప్రత్యేక తనిఖీల్లో దేశవ్యాప్తంగా 56,431 ఆహార విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు రూ.81.80 కోట్ల విలువైన 3,279.57 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. పాలు, నెయ్యి, పనీర్, స్వీట్లు తదితర ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు.

నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 52 సంస్థల లైసెన్సులను రద్దు చేయగా మరో 1,133 సంస్థల లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. అదేవిధంగా 314 సంస్థలను మూసివేశారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 10,047 నోటీసులు జారీ చేశారు.

పండుగల వేళ ప్రత్యేక నిఘా

పండుగల సమయంలో ఆహార పదార్థాల వినియోగం పెరిగే నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు FSSAI వెల్లడించింది. ఈ ఏడాది సంప్రదాయ ఆహార వ్యాపార సంస్థలతో పాటు ఈ-కామర్స్ సంస్థలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపింది. ఆహార కల్తీకి పాల్పడే వారిపై నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *