రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, అమరావతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు ఎకనమిక్‌ రీజియన్ల పరిధిలో చేపట్టిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన కార్యాచరణను అధికారులు సీఎంకు వివరించారు.

ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్‌, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్‌ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది.

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో 167 అభివృద్ధి పనులు

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (VER) పరిధిలో వివిధ శాఖలకు సంబంధించి 167 అభివృద్ధి పనులను గుర్తించగా ఇప్పటికే 64 పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాంతానికి ప్రధాన ప్రాజెక్టుగా వైజాగ్‌ బే సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్‌ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.

విశాఖలో స్టీల్‌ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్‌ సిటీ అభివృద్ధితోపాటు పోర్టుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. విశాఖకు 15 నుంచి 20 కొత్త ఐటీ కంపెనీలను ఆకర్షించడంతోపాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తీర ప్రాంత అభివృద్ధితోపాటు కోనసీమ బ్యాక్‌వాటర్స్‌ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

తిరుపతి రీజియన్‌లో పారిశ్రామిక క్లస్టర్లు

తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ (TER)ను అగ్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, స్పేస్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌, ఆటోమొబైల్‌, ఈవీ, డిఫెన్స్‌, టూరిజం, నాలెడ్జ్‌ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రాష్ట్రంలో గుర్తించిన 87 గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టులు తిరుపతి ఆర్థిక ప్రాంతం పరిధిలో ఉండటం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం సంతరించుకుంది. హార్టికల్చర్‌ హబ్‌ అభివృద్ధిలో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్‌, మీట్‌ అండ్‌ పౌల్ట్రీ, ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌, టెర్మినల్‌ మార్కెట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాలకు అనుగుణంగా ప్రత్యేక పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అమరావతి రీజియన్‌లో రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం

అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్‌ రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.

కోస్టల్‌ టూరిజం అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

మూడు ఎకనమిక్‌ రీజియన్లలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *