విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. స్టేషన్‌ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. గురువారం విశాఖ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ శ్రీభరత్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసుల కారణంగా అభివృద్ధి పనులు ఏడాది పాటు ఆలస్యమయ్యాయని వివరించారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, 2028 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫారాలను 14కు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాట్‌ఫారాల సంఖ్య పెరగడం వల్ల రైల్వేస్టేషన్‌ వెలుపల రైళ్ల నిరీక్షణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మరిన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

పార్కింగ్‌ సదుపాయాలను కూడా భారీగా విస్తరిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఒకేసారి 450 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్‌లో రైన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని సదుపాయాలతో విశాఖ రైల్వేస్టేషన్‌ను దేశంలోనే అత్యుత్తమ రైల్వేస్టేషన్లలో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ఎంపీ శ్రీభరత్‌ పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *