జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ కూటమి పార్టీలకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల కంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతంపైగా స్ట్రైక్‌రేట్ కూటమి పార్టీలకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల కంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో విజయం అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇదని చెప్పారు.
వైసీపీ ఓటింగ్ శాతం తగ్గింది..
ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే గెలుపు అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓటింగ్ శాతం 2024 కంటే తగ్గిందని ప్రస్తావించారు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై తాను ప్రత్యేకంగా శ్రద్ధపెట్టానని వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి స్థానంలో కూటమి గెలవాలని అందరం కోరుకున్నామని తెలిపారు. అప్పుడే కూటమి పటిష్ఠంగా ఉంటుందనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎంపికపై చాలా కసరత్తు చేశాం..
స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేశామని సీఎం వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై చాలా కసరత్తు చేశామని తెలిపారు. చదువు, ప్రవర్తన, పార్టీ పట్ల అంకితభావం, విధేయత కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. తమ వద్ద ఉన్న డేటా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు. కార్యకర్తే అధినేత… కార్యకర్త లేకపోతే నాయకులు లేరని స్పష్టం చేశారు. బీసీలు ఎప్పటినుంచో టీడీపీకి అండగా ఉన్నారని.. కష్టంలో కూడా పార్టీకి తోడుగా నిలిచారని తెలిపారు.
రాజ్యాధికారంలో స్థానం కల్పించాం..
అందువల్లే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించామని చెప్పుకొచ్చారు. అందుకే ఒక ఎంపీటీసీని ఎంపీగా చేశామని తెలిపారు. పల్నాడులో కూడా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేశామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జనరల్ స్థానంలో ఎస్సీ మహిళతో పోటీ చేయించామని.. ఆమెకు జడ్పీ ఛైర్మన్ ఇచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ కోట పుల్లమ్మ ఏంటెక్ చదువుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు వస్తే జగన్ అండ్ కో అడ్డుపడుతున్నారు..
ఏపీలో ఎన్నికలు వస్తే జగన్ అండ్ కో అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తమపై మెత్తం 63 కేసులు వేసి స్థానిక ఎన్నికలను ఆపాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇవి విఫలం కావడంతో హింస చేయాలని చూశారని దుయ్యబట్టారు. మొదటి రోజు హింసకు పాల్పడింది వైసీపీ నేతలే అని చెప్పారు. ఈ ప్రయత్నాలు అన్నింటిని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. అందుకే ప్రజలకు హాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. కూటమిపై విశ్వాసంతో తుపాను సమయంలో కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమకు ఓటు వేశారని తెలిపారు. 2024లో ప్రజలు మెజారిటీ ఇచ్చి కూటమికి శక్తి ఇచ్చారని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఇచ్చిందని.. ఇప్పుడు అన్ని వ్యవస్థలు నిలబడుతున్నాయని వెల్లడించారు. మొన్న కేంద్రమంత్రి అమిత్ షా వచ్చి రాబోయే పదేళ్లలో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుందని చెప్పారన్నారు. ఇందుకు కారణం ప్రజలు ఇచ్చిన తీర్పే అని సీఎం చంద్రబాబు తెలిపారు.
