Cyclone Akvan: బంగాళాఖాతంలో తీవ్ర అక్వాన్ తుఫాన్ కొనసాగుతోంది. ఉత్తరదిశగా ఇది కదులుతోంది. దీంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు ఇది తీరం దాటే అవకాశముందని ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనుండగా.. తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను “అక్వాన్” (Akvan) ఉత్తర దిశగా కదులుతూ నవంబర్ 19న ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో 14.9° ఉత్తర అక్షాంశం, 85.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది నర్సాపూర్ (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, కళింగపట్నం(ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 400 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 490 కి.మీ, పూరి (ఒడిశా)కు దక్షిణంగా 550 కి.మీ, చెన్నై(తమిళనాడు)కు తూర్పు-ఈశాన్యంగా 590 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ.. నవంబర్ 20న మధ్యాహ్నం సమయానికి నర్సాపూర్, పూరి మధ్య, గోపాల్‌పూర్‌కు తూర్పున సమీపంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ. వేగంతో, గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వాతావరణ సూచనలను జారీ చేసింది.

తెలంగాణలో వర్షాలకు ఛాన్స్..

ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు ఉత్తర, తూర్పు జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.  పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో వర్షాలు పడే సమయంలో చెట్లు, హోర్డింగ్ కింద ఉండవద్దని సూచించింది.

ఏపీకి భారీ వర్షసూచన..

ఏపీలో అక్వాన్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది.  రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. భారీ నుండి అతి భారీ వర్షాలు పాటుగా అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉండటంతో పాటు పెను గాలులు గంటకు 90 నుండి 100 కి.మీ గరిష్టంగా 110 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. తుఫాన్ నవంబర్ 20న తీరం దాటనున్న క్రమంలో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉండే అవకాశముందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *