
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను నవంబర్ 20న మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారిన అక్వాన్.. బుధవారం ఉదయం 5.30 గంటల సమయానికి దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ తుపాను చెన్నైకి తూర్పున 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నవంబర్ 20న తీరం దాటే అవకాశం
అక్వాన్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలోనూ ఇది తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని పేర్కొంది.
తుపాను ప్రభావంతో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్లకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అక్వాన్ మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు లేవని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
