న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో భారత వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులకు మిఠాయిలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సరిహద్దుల్లో మన సాయుధ దళాలు రేయింబవళ్లు దేశాన్ని కాపాడుతున్నందువల్లే ప్రజలు ప్రతి పండుగను ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుపుకోగలుగుతున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవ పట్ల యావత్ దేశం గర్విస్తోందని అన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత వాయుసేన సామర్థ్యం ప్రపంచానికి వెల్లడైందని తెలిపారు.

సైనికుల్లో ధైర్యం, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ సైనికుల నిబద్ధత, ధైర్యం లేకపోతే ఆశించిన ఫలితాలు సాధించలేమని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ ఒక సాధారణ సైనికుడిని అసాధారణ యోధుడిగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.

మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సాయుధ దళాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సైనికులకు తగిన శిక్షణ అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త యుద్ధ సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.

రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకుంటూ భారత సాయుధ దళాలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సైనికుల సహకారంతో భారత్ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే దేశంలో పెరుగుతున్న రక్షణ ఉత్పత్తుల సామర్థ్యాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా దేశీయ స్టార్టప్‌లు, పరిశ్రమలు డ్రోన్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సైనికుల కోసం అధునాతన పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయని పేర్కొన్నారు.

By Ramya