
నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, నిర్వహణ లోపాలపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో కలిసి ఆస్పత్రిని సందర్శించిన ఆయన వివిధ విభాగాలు, వార్డులను పరిశీలించారు. వైద్యం కోసం వస్తున్న పేద, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మూడేళ్ల క్రితమే మంజూరైన ఎంఆర్ఐ స్కాన్ సేవలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ స్కాన్ సేవలు సక్రమంగా అందడం లేదని, త్రీడీ ఎక్స్‌రే విభాగానికి తాళం వేసి ఉండటాన్ని గమనించి అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం ఎలా అందుతుందని నిలదీశారు.
చిన్నపిల్లల విభాగంలో నవజాత శిశువులకు అవసరమైన ర్యాప్‌లు అందుబాటులో లేకపోవడంతో పాత వస్త్రాల్లో చుట్టి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ కూడా అధ్వానంగా ఉందని విమర్శించారు. గత జనవరి నెలతోనే పాత శానిటేషన్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ కొత్త కాంట్రాక్టర్‌ను నియమించకపోవడంతో ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. తక్షణమే కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లల కేసులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నాయని, ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు కారణంగానే ఇలా జరుగుతోందని కంచర్ల ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య కూడా తగ్గుతోందని పేర్కొంటూ, ఈ పరిస్థితులపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.35 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణాన్ని చేపట్టినట్లు కంచర్ల తెలిపారు. ఇందులో 50 ఐసీయూ పడకలు, 25 డయాలసిస్ పడకలు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది లక్ష్యమని వివరించారు. అయితే ప్రస్తుతం ఆ విభాగం నిరుపయోగంగా ఉండటం బాధాకరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రూ.270 కోట్ల వ్యయంతో 42 ఎకరాల విస్తీర్ణంలో నల్లగొండ మెడికల్ కళాశాలను నిర్మించినట్లు గుర్తుచేశారు. అలాగే రూ.45 కోట్లతో నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
