
నిద్రపోయే సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిరి వల్ల ఇబ్బంది పడుతున్నారా? మీరు నడిచేటప్పుడు కాళ్లు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా? కూర్చున్నప్పుడు మీ కండరాలు అకస్మాత్తుగా రాయిలా బిగుసుకుపోతున్నాయా? అయితే, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు స్పాస్టిసిటీ తో బాధపడుతున్నట్టు అర్థం. స్పాస్టిసిటీ గురించి సరళంగా చెప్పాలంటే “కండరాలు అసాధారణంగా బిగుసుకుపోవడం లేదా గట్టిపడటం.” ఇది మెదడు లేదా వెన్నుపాము దెబ్బతినడం వల్ల వచ్చే ఒక నరాల సమస్య.
సాధారణంగా మన శరీర కదలికల్ని కొన్ని ప్రత్యేకమైన నరాల వ్యవస్థలు నియంత్రిస్తాయి. కానీ ఈ నరాల దారికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు, కండరాలపై నియంత్రణ తప్పి అవి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల చేతులు, కాళ్ళు కదిలించడం, నడవడం, చేతులతో వస్తువులు పట్టుకోవడం వంటి రోజువారీ పనులు చేయడం చాలా కష్టంగా మారుతుంది. స్పాస్టిసిటీ గురించి డా. అవినాష్ కుమార్ అడ్డోజు (కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్, లక్డికాపూల్) పూర్తి వివరాలు అందించారు
- కండరాల బిగుతు: చేతులు లేదా కాళ్ళలో స్పష్టమైన గట్టిదనం లేదా బిగుతుగా అనిపించడం.
- కదలికలకు ఇబ్బంది: చేతిని లేదా కాలును చాచడానికి, మడవడానికి ప్రయత్నించినప్పుడు కండరాలు మొండికేయడం (రెసిస్టెన్స్).
- నొప్పి, అసౌకర్యం: కండరాల్లో ఎప్పుడూ ఒక రకమైన లాగినట్లు ఉండటం, తిమ్మిరితో పాటు విపరీతమైన నొప్పి.
- నడకలో మార్పు: నడుస్తున్నప్పుడు కాళ్ళు వెనక్కి లాగుతున్నట్లు లేదా భూమికి అతుక్కుపోయి ఈడ్చుకుంటూ నడుస్తున్నట్లు అనిపించడం.
- కండరాల తిమ్మిరి (Spasms): అకస్మాత్తుగా, మన ప్రమేయం లేకుండానే కండరాలు గట్టిగా పట్టేయడం.
- సమతుల్యత కోల్పోవడం: నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, దీనివల్ల తరచూ కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది

