
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోంది. 2026 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన 2026 జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.
ఈ డీఎస్సీలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన దాదాపు 2,500కుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 2,535 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ ద్వారా స్పష్టమవుతాయి.
మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలతో పాటు సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ సంక్షేమ విద్యా సంస్థలు, మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2,991 పోస్టులు నాలుగో విడతలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఇన్‌స్ట్రక్టర్లు తదితర పోస్టులు ఉన్నాయి. అయితే డీఎస్సీకి సంబంధించిన తుది పోస్టుల వివరాలను సంబంధిత నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.
డీఎస్సీతో పాటు డైట్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. వీటిలో పలు పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. 2026 నుంచి వచ్చే సంవత్సరాల్లో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ ఖాళీలపై కూడా కసరత్తు జరుగుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ అక్టోబర్‌లో విడుదలైతే పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే పరీక్ష తేదీలు, అర్హతలు, దరఖాస్తు విధానం, సిలబస్, పోస్టుల వారీగా ఖాళీలపై తుది వివరాలు అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే స్పష్టమవుతాయి.
