
2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీని తప్పనిసరిగా చేర్చాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. అవసరమైతే తాడేపల్లిలో ధర్నా చేసి అయినా ఈ అంశంపై ఒప్పిస్తామని వ్యాఖ్యానించారు.
బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. రైతులు వ్యవసాయం చేస్తూ అప్పుల పాలవుతున్నారని, 2024 ఎన్నికలకు ముందు రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని అప్పట్లో జగన్‌ను కోరినట్లు తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తప్పుడు హామీలు ఇవ్వడం తనకు ఇష్టం లేదని జగన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
రైతులు వైఎస్సార్ కుటుంబానికి అభిమానులని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అందువల్ల భవిష్యత్‌లోనూ రైతులకు మేలు చేసే అంశాలకు పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటికీ వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని అన్నారు. ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
2029లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 24తో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన శాలువాలతో సన్మానించారు.
