
కడప జిల్లా పులివెందులకు చెందిన చిదిగే సాయి వర్షిత అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఆరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఆమె.. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. బెంగళూరులో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేతుల మీదుగా ఇటీవల నియామక పత్రాన్ని అందుకున్నారు.
చిదిగే సాయి వర్షిత.. అనిలాదేవి, గురుదత్త దంపతుల రెండో కుమార్తె. పులివెందులలో పదో తరగతి వరకు చదివిన ఆమె.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. తన చదువులో భాగంగా నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాయి వర్షిత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2024లో తొలిసారి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష రాశారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినప్పటికీ మెయిన్స్‌లో ఎంపిక కాలేకపోయారు. అయితే ఆ వైఫల్యంతో నిరాశ చెందకుండా లోపాలను విశ్లేషించుకుని మరింత పట్టుదలతో చదివారు.
ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖలో వరుసగా ఐదు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కోఆపరేటివ్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, టెక్నికల్ క్లర్క్ పోస్టులు దక్కించుకున్నారు. అయినప్పటికీ అక్కడితో ఆగకుండా మరింత మెరుగైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమయ్యారు.
తర్వాత ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షకు సిద్ధమయ్యారు. మొత్తం 412 పోస్టుల కోసం దేశవ్యాప్తంగా 28,15,445 మంది దరఖాస్తు చేసుకోగా.. 13.77 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పోటీలో సాయి వర్షిత ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో రీసెర్చ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 19న బెంగళూరులో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సాయి వర్షిత సూచిస్తున్నారు. అన్ని అంశాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా ప్రణాళికతో చదవాలని చెబుతున్నారు. వైఫల్యం ఎదురైతే నిరాశ చెందకుండా, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆమె సూచిస్తున్నారు.
