తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొండలు, గుట్టలను తవ్వి తరలిస్తున్నారంటూ జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. రామచంద్రపురం మండలం రామాపురం పంచాయతీ పరిధిలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి తవ్వకాలను పరిశీలించాలని కోరారు.

కొండలు, గుట్టలను తవ్వి తరలిస్తున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇలాంటి ఘటనలు తగ్గడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే పులివర్తి నాని బహిరంగంగా స్పందించాలని కోరారు.

బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్‌కు ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను అక్కడికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించినట్లు పులివర్తి నాని తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పులివర్తి నానికి బొలిశెట్టి సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *