
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా ఎమ్మెల్యే థామస్ సొంత మండలంలోనే జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఓటమిపై తాజాగా స్పందించిన ఎమ్మెల్యే థామస్.. సొంత మండలంలో ఎదురైన పరాజయం తనను తీవ్ర అవమానానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరాజయం తనకు తీవ్ర అవమానంగా అనిపిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. 40 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ.. మూడు ఎంపీపీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను ఎందుకు గెలుచుకోలేకపోయామని పార్టీ నేతలను నిలదీశారు. ఈ ఓటమి కారణంగా సహచర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లేదంటే 2029లో తాను ఎమ్మెల్యేగా ఉండనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తే.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాత్రం భిన్నమైన ఫలితాలు రావడంపై ఎమ్మెల్యే థామస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, రెండు ఎంపీపీ స్థానాలను కోల్పోవడంపై పార్టీ నేతల తీరును తప్పుబట్టారు.
ఈ ఎన్నికల్లో కొందరు టీడీపీ నాయకులే వైఎస్సార్సీపీ నేతలతో చేతులు కలిపి పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి ఉన్నవారే టీడీపీలో కొనసాగాలని, లేదంటే వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి నాయకులమని చెప్పుకునే కొందరు నేతలు తమ సొంత సెగ్మెంట్లలో కనీసం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు.
ఇకనైనా నాయకులు, కార్యకర్తలు కళ్లు తెరిచి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని థామస్ సూచించారు. ఎమ్మెల్యేనే అన్ని పనులు చేసి, నాయకులకు పదవులు తెచ్చిపెట్టాలా? మీ కోసం మీరు కష్టపడలేరా? అంటూ నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను ఓడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వైఎస్సార్సీపీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎమ్మెల్యే థామస్ సొంత మండలమైన కార్వేటినగరంలో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. జనసేన అభ్యర్థి బాలాజీరెడ్డిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి జగదీష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు వెదురుకుప్పం, ఎస్ఆర్పురం మండలాల్లోనూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అంతేకాకుండా ఎస్ఆర్పురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. దీంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కూటమి నేతలకు ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి.
