విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన రెండు రోజుల CII సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 450 మందికి పైగా విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 1,400 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌, ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రానా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా లోకేశ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలో విశాఖపట్నంలోనూ పూర్తిస్థాయి సినిమా ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కేవలం సినిమా షూటింగ్‌లకే పరిమితం కాకుండా స్టూడియోలు, డబ్బింగ్‌ సదుపాయాలు, వీఎఫ్‌ఎక్స్‌ ల్యాబ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ యూనిట్లతో సహా చిత్ర నిర్మాణానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. దీనిపై రానా సానుకూలంగా స్పందించారు. విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

గతంలో హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి స్టూడియోలు, మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయని రానా గుర్తుచేశారు. విశాఖలోనూ ఇలాంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తే సినీ పరిశ్రమ విస్తరించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

మొత్తంగా CII సమ్మిట్‌ వేదికగా లోకేశ్‌, రానా మధ్య జరిగిన ఈ చర్చ విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఆసక్తిని పెంచింది. మరోవైపు పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు దారితీసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *