
తెలుగు సాహిత్య రంగంలో సరికొత్త చరిత్రకు వేదిక సిద్ధమవుతోంది. తొలిసారిగా మహిళా సహస్రావధానం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ అవధాని బులుసు అపర్ణ ఈ అరుదైన సాహితీ ప్రక్రియను చేపట్టనున్నారు. డిసెంబరు 10 నుంచి జనవరి 3 వరకు 25 రోజులపాటు విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుంది.
విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం అవధానం నిర్వహించనున్నారు. డిసెంబరు 10న ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 3న ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు సమక్షంలో ధారణ విజయోత్సవ కార్యక్రమం జరగనుంది.
ఈ సందర్భంగా జనవరి 3న 750 పద్యాలను ధారణ చేయడంతో పాటు ఆశుపద్యాలు ఘంటావధానం కలిపి మొత్తం వెయ్యి పద్యాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వివరాలను హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల కరస్పాండెంట్ టి. శ్రీనివాసు, అవధాని బులుసు అపర్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు. తెలుగు సాహిత్య రంగంలో మహిళా ప్రతిభకు ఈ సహస్రావధానం ఒక విశేష వేదికగా నిలవనుంది.
