D Spiritual: Nov 9: మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్ర స్వామి బంగారు పల్లకి సేవ

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్తికా బృందావనానికి అర్చకులు సుధీంద్ర అర్చక్ బంగారు పల్లకి సేవ నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంత్రాలయానికి తరలివచ్చారు.

మంత్రాలయానికి చేరుకున్న భక్తులు ముందుగా పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వెండి మృత్తికా బృందావనాన్ని వెండి సింహాసనంపై అధిష్ఠింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని బంగారు పల్లకిలో ఉంచి శ్రీమఠం ప్రాకారంలో మంగళవాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగించారు. ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మరోవైపు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందించి ఆశీర్వదించారు. దీపావళి పర్వదినం సందర్భంగా మంత్రాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, బంగారు పల్లకి సేవతో శ్రీమఠం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *