యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా జరిపించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొండ కింద ఉన్న వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్‌తో కలిసి బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో దేవస్థానం అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *