ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్‌కు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం జీఓ ఎంఎస్ నంబర్ 158 జారీ చేసింది.

సెప్టెంబర్ 1, 2004కు ముందు ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలై, ఆ తర్వాత ఎంపికై విధుల్లో చేరిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31లోగా వన్‌టైమ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ ప్రక్రియను ‘నిధి’ (NIDHI) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారితో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక నోటిఫికేషన్, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరినట్లు ధ్రువీకరించే పత్రాలను పోర్టల్‌లోని ‘CPS-OPS Conversion’ విభాగంలో అప్‌లోడ్ చేయాలి. ఒకసారి సమర్పించిన ఆప్షన్‌ను మార్చుకునే అవకాశం ఉండదు.

ఆప్షన్ ఆమోదం పొందిన తర్వాత ఉద్యోగులను జీపీఎఫ్ లేదా ఇతర ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు. ఉద్యోగి సీపీఎస్ ఖాతాలోని వ్యక్తిగత వాటాను జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రభుత్వ వాటా, దానిపై వచ్చిన వడ్డీని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఉద్యోగులందరికీ ఒకే విధంగా ఈ ప్రక్రియ అమలయ్యేలా కార్యాచరణ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. నియామక అధికారులు, కార్యాలయ అధిపతులు దరఖాస్తులను వేగంగా పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు కీలక ఉపశమనంగా మారాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *