ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. అయితే అనంతపురం కార్పొరేషన్‌తో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో కూటమి ఓటమికి గల కారణాలపై సమగ్రంగా సమీక్షిస్తామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని, రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సుపరిపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం పెరిగిందని, పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కలిపి 58.9 శాతం ఓట్లు సాధించామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఒకట్రెండు ప్రాంతాల్లో ఎదురైన ఓటమిని తేలిగ్గా తీసుకోబోమని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా అనంతపురంలో కూటమి ఓటమికి గల కారణాలపై లోతైన విశ్లేషణ చేస్తామన్నారు. వాస్తవాలను పరిశీలించి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కుప్పంలో ఒక ఎంపీటీసీ స్థానంలో ఓడిపోయినా ప్రజాతీర్పును గౌరవించామని, అనైతిక పద్ధతుల్లో ఆ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే తమ విధానమని పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదని చంద్రబాబు అన్నారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతికూల ఫలితాలు ఎందుకు వచ్చాయో సమీక్షిస్తామని, ఓటర్లపై ప్రలోభాల ప్రభావం ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.

అల్లూరి జిల్లాలో జెడ్పీ పీఠం వైసీపీకి దక్కిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపైనా దృష్టి సారిస్తామన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి వెనుకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. మెజార్టీ పెరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *